భిక్షకాదు మా హక్కు

రాష్ట్రంలో పన్నులు వసూలుచేసే బాధ్యత మాత్ర మే కేంద్రానిది..  ఆ పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చేది భిక్ష కాదని.. రాజ్యాంగం రాష్ర్టాలకు కల్పించిన హక్కుఅని పేర్కొన్నారు.  నాడు సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌.. నేడు జీఎస్టీ పేరుతో బీజేపీ వాస్తవంగా రాష్ర్టాలకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చే నిధుల అంశంలో బీజేపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు. యాభై, అరవై ఏండ్ల తర్వాత.. అదీ కాంగ్రెస్‌ పాలనపై విసుగుతో కేంద్రంలో బీజేపీకి ప్రజలు అవకాశమిచ్చారు కానీ.. ప్రేమతో కాదని వ్యాఖ్యా నించారు. లేకలేక వచ్చిన ఆ అవకాశాన్ని కూడా బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు. 


దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ అట్టర్‌ప్లాప్‌ అయ్యాయన్నారు. దేశంలో పన్నుల పద్ధతి, వాటిని ఎవరు వసూలు చేయాలనే అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని సీఎం తెలిపారు. ఐటీ వంటి పన్నులు వసూలు చేసే బాధ్యతను కేంద్రానికి కల్పించిందని, వసూలయిన పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని సూచించారన్నారు. అయితే రాష్ర్టాలకు వాటా ఇవ్వడంలో కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు మొదట్నుంచీ మోసం చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. జీఎస్టీ నష్టపరిహారం, ఐజీఎస్టీ బకాయిలు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని.. సరైన సమయంలో ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే వీటితోనే ప్రతిరాష్ట్రం ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా అత్యవసర నిధులకు వాడుకుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.